Editor's Corner

జర్నలిజమా? శాడిజమా?!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక బుధవారం ఒక కథనాన్ని వండి వార్చింది. పొరుగు రాష్ట్రంలో కడప గడ్డపై తమ ఇంటి పండుగలాంటి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోన్న వేళ ఆ వార్తలకు ఫస్ట్‌ పేజీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్సీ కవితపై కట్టుకథను పతాక శీర్షికన ప్రచురించింది. బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ పార్టీ మార్పుపై కథనం రాస్తున్నప్పుడు కనీసం ఆమె వివరణ తీసుకోవాలన్న సోయి మరిచింది ఆంధ్రజ్యోతి. జర్నలిజం విలువల వలువలను ఎప్పుడో వదిలేసి ఒక రాజకీయ పార్టీతో ప్రత్యక్షంగానే అంటకాగుతోన్న మీడియా హౌస్‌ ఎమ్మెల్సీ కవితను టార్గెట్‌ చేస్తూ కథనాలు వండి వార్చడం వెనుక పెద్ద లక్ష్యమే ఉన్నది. తెలంగాణలో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమికి గ్రౌండ్‌ క్లియర్‌ చెయ్యడమే ఇప్పుడు సీమాంధ్ర మీడియా హౌస్‌ ల పని. తద్వారా తెలంగాణపై గుత్తాధిపత్యం చెలాయించొచ్చు అనేది ఆ సెక్షన్‌ నాయకత్వం, మీడియా బాసుల అంతరంగం. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితను టార్గెట్‌ చేస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. తమ లైవ్‌ చానెళ్లలో స్పెషల్‌ డిస్కషన్స్‌, స్టోరీల రూపంలో ప్రచారం చేస్తున్నారు.బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర లోపే బీఆర్‌ఎస్‌ నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం ఇక్కడ రాజకీయ గుత్తాధిపత్యం చెలాయిస్తోన్న, చెలాయించాలని చూస్తోన్న సెక్షన్స్‌ కు మింగుడు పడలేదు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అనే నినాదం పని అయిపోయింది.. ఇక లేచి నిలబడలేదు అనుకున్న వారి అంచనాలు ముక్కలు చెక్కలు అయ్యాయి. దీంతో తాము ఊహాలోకంలో నిర్మించుకున్న మాయాసౌధం శిథిలమయ్యిందనే అక్కసు ఆ సెక్షన్‌ మీడియాతో పాటు వాటిని పెంచిపోషిస్తున్న సీమాంధ్ర రాజకీయ శక్తులకు మిగిలింది. ఈక్రమంలోనే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ ప్రసంగంపై ఫీడ్‌ బ్యాక్‌ పేరుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖను అడ్డం పెట్టుకొని కృత్రిమ ప్రచారాలు కొనసాగించాయి. తన లేఖను లీక్‌ చేసిన దెయ్యాలెవరో బయట పెట్టాలని కవిత స్పష్టమైన డిమాండ్‌ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. ఈక్రమంలోనే పార్టీలో ముఖ్య నాయకుల ప్రాపకం కోసం కొంత మంది ఈ విషయాన్ని చిలువలు పలువలు చేసే ప్రయత్నం చేశారు. కాలమే అన్నింటికీ సమధానం చెప్తుందన్న ధోరణిలో ఎమ్మెల్సీ కవిత వాటిని చూసీ చూడనట్టు వదిలేశారు.తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్‌ వెంట నడిచిన నాయకత్వానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కవిత కొంత కాలంగా చెప్తున్నారు. కొన్ని నెలలుగా ప్రజల్లోనే ఉంటున్న ఆమె 47 నియోజకవర్గాల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తలను ప్రత్యక్షంగా కలిశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమ నాయకత్వం నిరదారణకు గురైందనే వాస్తవాన్ని గుర్తించి వాళ్లందరికీ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ఇది సహజంగానే పార్టీలో కొంత మంది నాయకులకు నచ్చకపోవచ్చు. ఈక్రమంలోనే కవితపై రకరకాల కథనాలు ప్రచారంలోకి తెచ్చారనే వాదన ఉంది. దీనినే తమకు అనుకూలంగా మలుచుకోవాలని సీమాంధ్ర రాజకీయ శక్తులు వ్యూహాలకు పదును పెట్టాయి. ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత, తన తండ్రికి వ్యక్తిగతంగా ఉత్తరం రాశారు. దానిని లీక్‌ చేసిన దెయ్యాలు ఎవరు అని సూటిగా ప్రశ్నించారు. ఆ దెయ్యాలెవరో తేలకముందే పార్టీలో కొందరు ముఖ్యనేతల సన్నిహితులు సోషల్‌ మీడియా వేదికగా కవితను టార్గెట్‌ చేశారు. తద్వారా ఆ దెయ్యాల్లో తమ ఆరాధ్య నాయకులు కూడా ఉన్నారనే వాళ్లే డప్పుకొట్టి చాటింపు వేసుకున్నారు. ఈ పరిణామాలను ఊతంగా మలుచుకొని ఆంధ్రజ్యోతి సహా అనేక మీడియా సంస్థలు తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈక్రమంలోనే జర్నలిజం ప్రమాణాలను గాలికొదిలేసి అబద్ధాలనే అక్షరాలుగా అచ్చేసి వికటాట్టహాసం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలకు పురిట్లోనే ముగింపు పలకపోతే ఆ శక్తులు తెలంగాణ అస్తిత్వాన్నే దెబ్బతీసే ప్రమాదముంది.

28 మే, 2025

సింగరేణి జాగృతి ఏర్పాటు వెనుక దీర్ఘకాలిక వ్యూహం!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? బీఆర్‌ఎస్‌ సింగరేణి కార్మిక విభాగం టీబీజీకేఎస్‌ కు గౌరవ అధ్యక్షురాలిగా పని చేసిన ఆమె ఇప్పుడు ఆ సంస్థ కార్మికుల్లో మరింత పట్టుసాధించే దిశగా పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సింగరేణి జాగృతి ఏర్పాటు వెనుక పకడ్బందీ వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సింగరేణి జాగృతిని ప్రకటించారు. సంస్థ పరిధిలోని 11 ఏరియాల కార్మికుల సమక్షంలో ఆమె ఈ నిర్ణయం వెలువరించారు. అలాగే అన్ని ఏరియాల్లో కార్మికులను సమన్వయం చేయడం, వారి సమస్యలపై స్పందించడానికి కో ఆర్డినేటర్లను సైతం ఏర్పాటు చేశారు. సింగరేణి ప్రాంతంలో జాగృతి ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని, కార్మిక కుటుంబాలతో మమేకమవుతామని కవిత ఈ సందర్భంగా ప్రకటించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థను పరిరక్షించడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి పని చేస్తుందని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి తోడు సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే ధ్యేయంగా కవిత అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని 26 అసెంబ్లీ నియోజవకర్గాల్లో సింగరేణి కార్మికుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఆయా నియోజవకర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులు ఉంటారు. సింగరేణి బొగ్గు గనుల్లో 40 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తుండగా పరోక్షంగా మరో లక్ష కుటుంబాలు సింగరేణిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మిక ప్రాంతంపై కవిత ఫోకస్‌ చేసినట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ దాదాపు తుడిచి పెట్టుకుపోయింది. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ పోటీ కూడా చేయలేదు. టీబీజీకేఎస్‌ నాయకత్వంలో ఉన్న వ్యక్తులతో బొగ్గు గని ప్రాంతంలోని ఎమ్మెల్యేలకు పొసగకపోవడం, వాళ్ల మధ్య విభేదాలు ఎక్కువ కావడంతోనే కవిత యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి సింగరేణి జాగృతి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సంస్థలో పని చేస్తున్న కార్మికుల్లో 60 శాతం మంది యువకులే కావడంతో వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. జాగృతి ఏరియా కో ఆర్డినేటర్లుగా నియమించిన వారిలో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వాళ్లే ఉండటంతో కార్మిక వర్గంతో పాటు సింగరేణి ప్రాంతంలోని బహుజనుల ఓటు బ్యాంకుపైనా కవిత దృష్టి సారించినట్టుగా అవగతమవుతోంది.తెలంగాణ భావజాల వ్యాప్తి, సాంస్కృతిక ఉద్యమానికి తెలంగాణ జాగృతి వేదికగా కవిత విశేషంగా పని చేశారు. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సాంస్కృతిక పతాక బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా జాగృతి సంస్థ కార్యకలాపాలు కొనసాగించింది. ఇప్పుడు మరింత విస్తృతంగా జాగృతి కార్యక్రమాలు కొనసాగించాలని కవిత నిర్ణయించారు. ఈక్రమంలోనే పలు విభాగాలకు ఇన్‌ చార్జీలను నియమించారు. ఇప్పుడు సింగరేణి జాగృతిని స్థాపించారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారని సమాచారం. తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం ప్రజల మధ్యే ఉండేలా కవిత ప్లాన్‌ చేసుకుంటున్నారని తెలుస్తోంది. బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేసిన కవిత ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అసెంబ్లీ, కౌన్సిల్‌ లో తీర్మానం చేయించడంలో సక్సెస్‌ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమించారు. ఆ ఫలితంగానే ఐమాక్స్‌ సమీపంలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే తరహాలో రాబోయే మూడున్నరేళ్లు ప్రజల మధ్యనే ఉండేలా కవిత కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

27 మే, 2025

కేసీఆర్ చుట్టున్న ఆ దెయ్యాలెవరు? !

‘‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలున్నారు’’ అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ ఇవి. ఎమ్మెల్సీ కవిత వ్యక్తం చేసిన ఇదే అభిప్రాయం పార్టీలోని అన్ని స్థాయిల నాయకుల్లో ఉందనేది వాస్తవం. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ సభలో కేసీఆర్ స్పీచ్ లో పాజిటివ్ అంశాలతో పాటు తన దృష్టికి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ను ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్ కు లేఖలో వివరించారు. కవిత తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన సమయంలో ఆ లేఖ లీక్ అయ్యింది. ఇది కాస్త తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. కవిత ఇక బీఆర్ఎస్ లో కొనసాగడం కష్టమని వేరు కుంపటి పెట్టుకోవడం ఖాయమంటూ రకరకాల ఊహాగానాలు సాగాయి. హైదరాబాద్ లో అడుగు పెడుతూనే ఎమ్మెల్సీ కవిత బాంబు పేల్చారు. కేసీఆర్ కు తాను లేఖ రాసింది నిజమేనని.. ఆ లేఖ ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ కు సన్నిహితంగా మెలుగుతున్న వారే లీకు వీరులని తేలిపోయింది. కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలున్నారు అన్న కవిత వ్యాఖ్యల చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కవిత చెప్పిన దెయ్యం ఫాలానా వాళ్లు అంటూ సోషల్ మీడియాలోనూ రకరకాల పోస్టింగులు దర్శనమిచ్చాయి. కొందరు నాయకులు ఇంకో అడుగు ముందుకేసి కవిత చెప్పిన దెయ్యం ఆయనే అని జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టులో విలేకరులతో మాట్లాడినప్పుడు తాను పార్టీ చీఫ్ కు రాసిన లేఖ ఎవరు బయట పెట్టారని సూటిగా ప్రశ్నించారు. పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య కార్యకర్తల సంగతి ఏమిటని నిలదీశారు. కవిత ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే పార్టీలో ఒక ముఖ్య నాయకుడి కనుసన్నల్లో పని చేసే సోషల్ మీడియా కార్యకర్తలు ఎమ్మెల్సీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఆ కాసేపటికే వాటిలో కొన్ని పోస్టులను డిలీట్ చేశారు. కవిత తమ బాస్ ను టార్గెట్ చేసిందనే అక్కసుతోనే ఈ పోస్టింగులు పెట్టారా? పార్టీలో ఉన్న ముఖ్యులు ఆ దిశగా సోషల్ మీడియా వారియర్స్ ను డ్రైవ్ చేశారా అనేది తేలాల్సి ఉన్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కవిత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి వంశీధర్ రావు కుటుంబ సభ్యులు. కేసీఆర్ తో ఎప్పుడూ వెన్నంటి ఉండేవాళ్లు సంతోష్, వంశీధర్ రావు. ఇప్పుడు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో, గులాబీ బాస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రగతి భవన్ లో మరికొందరు నాయకులు కనిపించినా సంతోష్ కుమార్ పర్మిషన్ ఇవ్వకుంటే ఎంతటి వారికైనా కేసీఆర్ ను కలిసే అవకాశం దక్కదు. ఈ విషయం పార్టీలో ఉన్న నాయకులందరికీ తెలుసు. కేవలం ముఖ్య నేతలనే కాదు కుటుంబ సభ్యులు సైతం కేసీఆర్ ను కలువకుండా మాజీ ఎంపీ అడ్డం పడుతూ ఉంటారని బాహాటంగానే చెప్తుంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ‘దెయ్యం’ అన్నది కూడా సదరు నాయకుడినే అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులే కాదు పార్టీని విడిచి వెళ్లిన వాళ్లు సైతం సదరు నాయకుడి వల్లనే పార్టీకి ఇన్ని అవస్థలు అని కుండబద్దలు కొడుతున్నారు.  ఎమ్మెల్సీ కవిత ‘దెయ్యాలు’ అని బహువచనం ఉపయోగించడంతో బయట ప్రచారంలో ఉన్న ఆ ఒక్కరికి తోడు ఇంకొందరు కూడా ఈ లిస్టులో చేరారని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ముఖ్య నాయకుడి స్పాన్సర్డ్ సోషల్ మీడియా కవితపై బురద చల్లే క్రమంలో తమ నాయకుడిని దెయ్యం లిస్టులో చేర్చామన్న సోయి మరిచింది. దెయ్యం లిస్టులో మరో నాయకుడి పేరు ప్రముఖంగానే వినిపిస్తుంది. కానీ వివాదంలో తాము తలదూర్చకూడదు అనున్నారో.. ఏం జరుగుతుందో చూద్దామనే వేచి చూసే ధోరణిలో ఉన్నారో కానీ ఆ నాయకుడి క్యాంపు ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉంది. ‘దెయ్యం’గా ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చిన నాయకుడిని ఇదివరకు రకరకాల పేర్లతో పిలిచేవాళ్లు. ఇప్పుడు ఆ పేర్లకు దెయ్యం కూడా యాడ్ అయ్యింది. మంచి అయినా చెడు అయినా సరే తమ బాస్ కు అంటించాలని చూసి ఆయన సోషల్ మీడియా టీమ్ సదరు నాయకుడిని దెయ్యం లిస్టులో చేర్చేసింది. మున్ముందు ఇంకెన్ని దెయ్యాలు వెలుగు చూస్తాయో!

26 మే, 2025

Amrabad | అమ్రాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటన..!

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరికాసేపట్లో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం (Amrabad) మాచవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. అమ్రాబాద్‌ మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు, చెంచు నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.అమ్రాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరికాసేపట్లో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం (Amrabad) మాచవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. అమ్రాబాద్‌ మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు, చెంచు నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు చెంచు నాయకులు మాట్లాడుతూ.. చెంచుల కోసం తెచ్చిన పథకాలలో భాగంగా పోడు భూములు కలిగిన కొంతమంది రైతులకు ఈ పథకాన్ని పరిచయం చేస్తున్నారన్నారు.అదేవిధంగా చెంచుల అభివృద్ధి కోసం మన్ననూరులో ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇక్కడున్న నైటీరియా కార్యాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించారని, దానిని తిరిగి మన్ననూర్‌కు తీసుకురావాలన్నారు. చెంచుల కోసం ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి సమావేశానికి చెంచు నాయకులను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలుచేస్తామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడి గిరిజనులను అరెస్టు చేయడం ఏంటన్నారు. అరెస్టయిన వారిలో చర్లపల్లి గ్రామానికి చెందిన చెంచు నాయకులు మల్లికార్జున్, గురువయ్య ఉన్నారు.

19 మే, 2025

రూ.300కోట్ల స్థలం కబ్జా వ్యవహారం నిందితులపై కేసు..!

నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదయ్యాయి.నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసు‘నమస్తే’ కథనాలతో స్పందించిన అధికారులుతహసీల్దార్‌ ఫిర్యాదుతో ఆర్గనైజ్డ్‌ క్రైం కింద కేసుబంజారాహిల్స్‌,మే 18: నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నెంబర్‌ 403/పీ లోకి వచ్చే టీఎస్‌ నెంబర్‌ 1/పి, బ్లాక్‌-హెచ్‌, వార్డు-10లో 5 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు బోగస్‌ పత్రాలను తయారు చేసిన పరుశరామ్‌ పార్థసారథి, అతడి కొడుకు విజయ్‌భార్గవ్‌ తదితరులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో పార్థసారథి మీద గతంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు క్రిమినల్‌ కేసులు నమోదు కాగా జైలుకు వెళ్లి వచ్చాడు.కాగా ఫిబ్రవరిలో సైతం అతడి అనుచరులు సంబంధిత స్థలం లోపలికి ప్రవేశించి గది నిర్మించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు స్థలం తమదేనంటూ దౌర్జన్యానికి దిగడంతో మరో కేసు నమోదయిన సంగతి తెలిసిందే.హెచ్చరిక బోర్డుల తొలగింపు..కాగా ఇటీవల మరోసారి పార్థసారథితో పాటు అతడి అనుచరులు 5ఎకరాల స్థలం బయట ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించడం, లోపలివైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు వ్యక్తులు నిఘా పెట్టిన వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలపై షేక్‌పేట్‌ మండల తహసీల్దార్‌ అనితారెడ్డి స్పందించారు. ఈనెల 16న రెవెన్యూ సిబ్బంది స్థలం వద్దు చేరుకుని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను తొలగించారు. రెవెన్యూ సిబ్బంది వెళ్లిపోగానే అదేరోజు రాత్రి మరోసారి బోర్డును తుడిచివేశారు. దీంతో శనివారం మరోసారి అక్కడకు చేరుకున్న రెవెన్యూ సిబ్బంది బోర్డులను రాయించడంతో పాటు గేటును సీజ్‌ చేసి తాళాలు వేశారు.బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు..కాగా ఎన్నిసార్లు హెచ్చరించినా పార్థసారథి, విజయ్‌తో పాటు వారి అనుచరులు పద్ధతి మార్చుకోకపోవడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. సుమారు రూ.300కోట్ల విలువైన స్థలాన్ని తమ స్థలంగా చూపిస్తూ జనాన్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారని షేక్‌పేట తహసీల్దార్‌ అనితారెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు పార్థసారథి, విజయ్‌తో పాటు స్థలంలోకి ప్రవేశిస్తున్న అనుచరులపై బీఎన్‌ఎస్‌ 329(3), 111(4), 221,352, 322, 324(2), 62 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రభుత్వస్థలాన్నికాజేసేందుకు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్న నిందితులపై ఆర్గనైజ్డ్‌ క్రైంగా బీఎన్‌ఎస్‌ 111(4) సెక్షన్‌ నమోదు చేయడం విశేషం.

19 మే, 2025

Joe Biden | అమెరికా మాజీ అధ్యక్షుడు.!

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఆయన ఎముకలకు క్యాన్సర్‌ కణాలు వ్యాపించాయని నిర్ధారణ అయింది. ఈమేరకు బైడెన్ కార్యాలయం వెల్లడించింది.అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో (Prostate Cancer) బాధపడుతున్నారు. ఆయన ఎముకలకు క్యాన్సర్‌ కణాలు వ్యాపించాయని నిర్ధారణ అయింది. ఈమేరకు బైడెన్ కార్యాలయం వెల్లడించింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వ్యాధి బయటపడినట్లు పేర్కొంది. ఈ క్యాన్సర్‌ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. దీనికి సంబంధించి చికిత్స అందించే విషయమై ఆయన కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.బైడెన్‌ అనారోగ్యంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) స్పందించారు. బైడెన్‌కు క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు తెలిసి తాను, మెలానియా చాలా బాధపడ్డామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బైడెన్‌ కుటుంబానికి తాము అండగా ఉంటామని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris) అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బైడెన్‌ పోరాట యోధుడని, క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పారు.జో బైడెన్‌ 2021 నుంచి 2025 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌తో జరిగిన చర్చలో విఫలమవడంతో పోటీనుంచి తప్పుకున్నారు. దీంతో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ ఎన్నికల బరిలో నిచారు. అయితే నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే.

19 మే, 2025