ఒక ధర్నా .. రెండు జాతీయ పార్టీలు టార్గెట్

5th Jun, 2025 12:06 PM

కాంగ్రెస్, బీజేపీ పై సమరశంఖం పూరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా, పోలీసులను ముందుపెట్టి ముందస్తు అరెస్టులతో కట్టడి చేయాలని చూసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. భారీ ఎత్తున తరలి వచ్చిన జాగృతి శ్రేణులతో ధర్నా చౌక్ కిక్కిరిసి పోయింది. ఈ వేదికపై నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై కవిత మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పడేళ్లలోనే దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను తీర్చిదిద్ధినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పటికే కృష్ణా నీళ్లను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ఏపీ ఇప్పుడు గోదావరి నీళ్ల దోపిడీకి తెరతీసిన వైనాన్ని కళ్లకు కట్టారు. ఈ ప్రయత్నాలకు తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్రంలోని.బీజేపీ ప్రభుత్వం ఎలా వంత పడుతుందో ఆధారాలతో సహా తేటతెల్లం చేశారు.


కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ లోని 20 లక్షల ఎకరాల బీడు భూముల్లో వరుసగా నాలుగేళ్లు బంగారు పంటలు పండిన పరిస్థితులను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేదిగడ్డ బ్యారేజీలో తలెత్తిన చిన్న సాంకేతిక సమస్యను బూచీగా చూపించి సాగులోక్ వచ్చిన 20 లక్షల ఎకరాలను ఎండబెడుతూ రైతులను అరిగోస పెడుతోన్న కాంగ్రెస్ ప్రభుత్వ క్షుద్ర రాజకీయాలను కళ్లకు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ వన్ లో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వినియోగంలోకి తెచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ.ప్రభుత్వం దొడ్డిదారిన చేపట్టిన తెలంగాణను ముంచే గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టు ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం, రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ఎంపీలు, సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల్లోగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోకుంటే తెలంగాణ జాగృతి పక్షాన 'సేవ్ గోదావరి' పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. కేసీఆర్ కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చిన ధర్నా గ్రాండ్ సక్సెస్ అయినట్టు కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయి.