సింగరేణి జాగృతి ఏర్పాటు వెనుక దీర్ఘకాలిక వ్యూహం

27th May, 2025 04:54 PM

టీబీజీకేఎస్‌ కు సమాంతరంగా జాగృతి కార్మిక విభాగం ఏర్పాటు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? బీఆర్‌ఎస్‌ సింగరేణి కార్మిక విభాగం టీబీజీకేఎస్‌ కు గౌరవ అధ్యక్షురాలిగా పని చేసిన ఆమె ఇప్పుడు ఆ సంస్థ కార్మికుల్లో మరింత పట్టుసాధించే దిశగా పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సింగరేణి జాగృతి ఏర్పాటు వెనుక పకడ్బందీ వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సింగరేణి జాగృతిని ప్రకటించారు. సంస్థ పరిధిలోని 11 ఏరియాల కార్మికుల సమక్షంలో ఆమె ఈ నిర్ణయం వెలువరించారు. అలాగే అన్ని ఏరియాల్లో కార్మికులను సమన్వయం చేయడం, వారి సమస్యలపై స్పందించడానికి కో ఆర్డినేటర్లను సైతం ఏర్పాటు చేశారు. సింగరేణి ప్రాంతంలో జాగృతి ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని, కార్మిక కుటుంబాలతో మమేకమవుతామని కవిత ఈ సందర్భంగా ప్రకటించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థను పరిరక్షించడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి పని చేస్తుందని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి తోడు సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే ధ్యేయంగా కవిత అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.


ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని 26 అసెంబ్లీ నియోజవకర్గాల్లో సింగరేణి కార్మికుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఆయా నియోజవకర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులు ఉంటారు. సింగరేణి బొగ్గు గనుల్లో 40 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తుండగా పరోక్షంగా మరో లక్ష కుటుంబాలు సింగరేణిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మిక ప్రాంతంపై కవిత ఫోకస్‌ చేసినట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ దాదాపు తుడిచి పెట్టుకుపోయింది. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ పోటీ కూడా చేయలేదు. టీబీజీకేఎస్‌ నాయకత్వంలో ఉన్న వ్యక్తులతో బొగ్గు గని ప్రాంతంలోని ఎమ్మెల్యేలకు పొసగకపోవడం, వాళ్ల మధ్య విభేదాలు ఎక్కువ కావడంతోనే కవిత యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి సింగరేణి జాగృతి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సంస్థలో పని చేస్తున్న కార్మికుల్లో 60 శాతం మంది యువకులే కావడంతో వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. జాగృతి ఏరియా కో ఆర్డినేటర్లుగా నియమించిన వారిలో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వాళ్లే ఉండటంతో కార్మిక వర్గంతో పాటు సింగరేణి ప్రాంతంలోని బహుజనుల ఓటు బ్యాంకుపైనా కవిత దృష్టి సారించినట్టుగా అవగతమవుతోంది.


తెలంగాణ భావజాల వ్యాప్తి, సాంస్కృతిక ఉద్యమానికి తెలంగాణ జాగృతి వేదికగా కవిత విశేషంగా పని చేశారు. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సాంస్కృతిక పతాక బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా జాగృతి సంస్థ కార్యకలాపాలు కొనసాగించింది. ఇప్పుడు మరింత విస్తృతంగా జాగృతి కార్యక్రమాలు కొనసాగించాలని కవిత నిర్ణయించారు. ఈక్రమంలోనే పలు విభాగాలకు ఇన్‌ చార్జీలను నియమించారు. ఇప్పుడు సింగరేణి జాగృతిని స్థాపించారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారని సమాచారం. తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం ప్రజల మధ్యే ఉండేలా కవిత ప్లాన్‌ చేసుకుంటున్నారని తెలుస్తోంది. బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేసిన కవిత ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అసెంబ్లీ, కౌన్సిల్‌ లో తీర్మానం చేయించడంలో సక్సెస్‌ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమించారు. ఆ ఫలితంగానే ఐమాక్స్‌ సమీపంలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే తరహాలో రాబోయే మూడున్నరేళ్లు ప్రజల మధ్యనే ఉండేలా కవిత కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Naveen Kamera