పవన్‌ సినిమా ఎఫెక్ట్‌.. జనసేన నేత సస్పెన్షన్‌

27th May, 2025 07:04 PM

థియేటర్ల మూసివేతకు బాధ్యుడిగా పేర్కొంటూ పార్టీ నుంచి గెంటివేత

సినిమా పరిశ్రమపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సొంత పార్టీ నేతపై వేటు వేయించారు. తన సినిమా హరిహరవీరమల్లు రిలీజ్‌ కు ముందు థియేటర్ల బంద్‌ పిలుపునకు బాధ్యులెవరో అన్వేషిస్తున్నారు. ఈక్రమంలో సొంత పార్టీ నాయకుడికి ఇందులో పాత్ర ఉందని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. రాజమండ్రికి చెందిన అత్తి సత్యనారాయణను జనసేన నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని పార్టీ కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ అజయ్‌ కుమార్‌ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. థియేటర్ల బంద్‌ పిలుపులో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్‌చార్జీ బాధ్యతల నుంచి కూడా తప్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. థియేటర్ల బంద్‌ పిలుపుతో సంబంధం ఉందా లేదా అనే అంశాన్ని విచారణను ఎదుర్కొని నిరూపించుకోవాలని తేల్చిచెప్పారు. సొంత సినిమా కారణంగా సొంత పార్టీ నేతపైనే వేటు వేయడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. థియేటర్ల బంద్‌ పిలుపు వెనుక పాత్రదారుల్లో సొంత పార్టీ నేతలున్నా ఉపేక్షించేది లేదని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన కాసేపట్లోనే సత్యనారాయణపై వేటు వేస్తూ నిర్ణయం ప్రకటించారు.